Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, April 25, 2013

యోహాను వ్రాసిన మూడవ పత్రిక

1. పెద్దనైన నేను సత్యమునుబట్టి  ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.
2. ప్రియుడా, నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్దిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్ధించుచున్నాను.
3. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. 
4. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు. 
5. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. 
6. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. 
7. వారు అన్యజనుల వలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక  దేవునికి తగినట్టుగా నీవు వారని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును . 
8. మనము సత్యమునకు సహాయకుల మవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై యున్నాము. 
9. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. 
10. వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా,సహోదరులను తానే   చేర్చుకొనక, వారని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంకపరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును. 
11. ప్రియుడా, చెడుకార్యమును కాక మంచి కార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడుకాడు. 
12. దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు.
13. అనేక సంగతులు నీకు వ్రాయవలసియున్నది గాని సిరాతోను కలముతోను నీకు వ్రాయ నాకిష్టము లేదు; 
14. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడుకొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.
    Download Audio File